shabd-logo

5వ భాగము

15 December 2023

2 చూడబడింది 2
మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో భాగం వాడికి విన్పిస్తుంది. ఆఖరి వాటాలో 14 సం॥ కుర్రాడు మూలుగుతున్నాడు. అదే గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని, పసుపు, నీలం రంగుల కలయికలతో, వైర్ బాగ్ ని చక చకా అల్లుతోంది ఒక అమ్మాయి. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా వీధివైపు మాటిమాటికీ చూస్తున్న ఆ అమ్మాయి మూలుగు విన్పించగానే మంచంవైపు తిరిగింది. వెంటనే చేతిలో అల్లుతున్న సామాను అక్కడ పడేసి లేచి వచ్చింది.

"రవీ! రవీ!" భుజంతట్టి పిలిచింది. మంచంలో సొమ్మసిల్లినట్టుగా పడుకుని ఉన్న కుర్రాడు నీరసంగా కళ్ళు తెరిచాడు. 'గిరిజక్కా!" దీనంగా చూశాడు.

"ఏమిట్రా?"

"ఏమిటోగా వుంది. చాలా భయం వేస్తోంది!" చేతులు చాస్తూ అన్నాడు. గిరిజ చప్పున మంచంమీద కూర్చుంది.

రవి ముఖంనిండా చెమటలు అలుముకున్నాయి.
"మళ్ళీ గుండెనొప్పిగా వుందా?" తలమీద చేయివేస్తూ అడిగింది. అవునన్నట్టు తలవూపాడు..

గిరిజ లేచి వెళ్ళి అల్మైరాలో వున్న టాబిలెట్ తీసి, మంచినీళ్ళు పట్టుకు వచ్చింది. తమ్ముడిని లేపి కూర్చోబెట్టి టాబిలెట్ మింగించి, మంచినీళ్ళు తాగించింది. రవి గట్టిగా ఆయాసపడుతున్నట్టుగా వూపిరి పీలుస్తున్నాడు. అతని ముఖంనిండా చెమటలు అలుముకున్నాయి. గిరిజ తాటాకు విసనకర్ర తీసుకువచ్చింది. తమ్ముడి తలని ఒడిలోకి తీసుకుని, మెల్లగా విసరసాగింది. కొద్దిసేపటికి అతనికి నొప్పి తగ్గినట్టుగా, ముఖం ప్రశాంతంగా అయింది.

"పోస్ట్ వచ్చిందా అక్కా?" నీరసంగా అడిగాడు.

"లేదురా. ఇవాళ ఎందుకో ఆలస్యం అయింది."

"పోస్ట్మాన్ వచ్చి వెళ్ళిపోయాడేమో!"

"ఉహు! నేను అన్నం తిన్నప్పటినుంచీ, ఆ కిటికీ దగ్గర కూర్చుని చూస్తూనే ఉన్నాను."

"ఇంతవరకూ ఎంత డబ్బు వచ్చింది?"

"434 ."

రవి పాలిపోయిన పెదవులమీద చిరునవ్వు మెదిలింది. "అయితే ఇంకా నీ ప్రకటన ఖర్చు కూడా రాలేదన్నమాట. నేను అప్పుడే చెప్పానా లేదా? ప్రకటనలు చదవగానే, దానం చేసే తీరుబాటు, శ్రద్ధ ఎవరికి ఉంటాయక్కా?"

"అలా అనకురా! ఏమిటో నాకయితే, ఆ భగవంతుడు ఏదో రూపంలో తప్పకుండా మనకి సాయం చేస్తాడని నమ్మకంగా అనిపిస్తోంది."

"అదంతా ఒట్టి భ్రమ అక్కా! మధు వచ్చి వెళ్ళాడా?"

"లేదు. ఇంటర్వ్యూ ఉందని చెప్పాడుగా. అక్కడనుంచి యింకా రాలేదేమో!" రవి గిరిజ చేయి పట్టుకున్నాడు. "అక్కా! మధుమూర్తి ఎంతో మంచివాడు కదూ! మనం అడక్కుండానే అన్నీ సాయం చేస్తాడు. అందుకని ఆ వరమ్మగారికి కోపం. మొన్న నేను ఒకసారి వాళ్ళింటికి వెళితే, ఆవిడ "నీకూ, మీ అక్కకీ పనీ పాటా లేదా? ఇళ్ళు పట్టుకుని తిరుగుతారు" అంది. "మధుని మా అక్క ఒక్కసారి వచ్చి వెళ్ళమంది" అని చెప్పానో లేదో, కళ్ళెర్రచేస్తూ నా మీదకి వచ్చింది. మావాడికి మీ ఇంటి చుట్టూ తిరగటమేనా? ఇంకేం పనిలేదా? పోపో, ఇంకెప్పుడూ యిలా కబుర్లు మోసుకురాకు. ఇలా మాటి మాటికీ

వాడికోసం కబురు చేయవద్దన్నానని చెప్పు" అని అరిచింది. బాక్తే, ఆవిడని చూస్తే నాకెంత భయం వేసిందో తెలుసా? నాన్న బ్రతికి వున్నప్పుడు, ఆవిడ మనింటికి "అన్నగారు" అంటూ ఎలా వచ్చేది? నాన్న దగ్గర ఎన్నిసార్లు డబ్బు అప్పు తీసుకుంది?"

"రవీ! నువ్వు అవన్నీ ఆలోచించకు, నిద్రపో" గిరిజ తమ్ముడి తలమీద చేయివేసి నిమిరింది.

గిరిజ మెల్లగా విసురుతుంటే, రవికి చెమటలు తగ్గినాయి. ఆరాటం శాంతించినట్లుగా నిద్రలోకి జారిపోయాడు. గిరిజ ఇంకా అలాగే విసురుతూ తమ్ముడి తల నిమురుతోంది. రవి శరీరం అనారోగ్యంతో కృశిస్తోందని వాడిని చూడగానే యిట్టే తెలిసిపోతోంది. బుగ్గలు పీక్కుపోయినాయి. షర్టు వదులు అయింది. పెదవులు ఎండినట్లుగా, పగిలి బీటలు వారినాయి. గిరిజ తమ్ముడి చిక్కిన చెంపల్ని ఆత్మీయంగా అరచేతితో రాచింది. ఈ మాయదారి రోగం వీడికి ఎందుకు రావాలి? వీడు కూడా తనకి లేకుండా పోతే! గిరిజ గుండెలు వుండచుట్టినట్టయినాయి. అసలే రెండు సంవత్సరాలక్రితం తండ్రి కామెర్లకి గురి అయి మరణించటంతో, తన జీవితం చీకటి అయిపోయింది. ఆ కటిక చీకటిలో వీడు చిన్న ఆశాదీపంగా అయ్యాడు. తండ్రి పోయినా సరే. ఒకరికి ఒకరు అండగా ఈ ప్రపంచంలో ఎవరూ చూడకపోయినా ఫర్వాలేదు అన్నట్టుగా, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. భగవంతుడికి తనమీద ఎందుకంత కసి? వీడిని కూడా నీకు దక్కనీయను అన్నట్లుగా బెదిరిస్తున్నాడా?

గిరిజ తమ్ముడి ముఖంకేసి తదేకంగా చూస్తోంది. తండ్రిపోయిన తర్వాత కొద్దికాలానికి, రవి అలసటగా, నీరసంగా వుంటోందంటుంటే తమ తండ్రిపోయిన బెంబేలుతనం అనుకుంది. స్కూలులో ఎప్పుడూ అన్నింటిలోనూ వాడే ఫస్టు. అలాంటిది ఆటల్లో పాల్గొనడం మానేశాడు. ఎందుకురా అంటే, "నాకేమిటో అలసటగా అనిపిస్తోందక్కయ్యా!" అనేవాడు. తిండి సరిలేక నీరసపడ్డాడేమో అనుకుంది.

తండ్రి పోగానే, ఏవో కాస్త డబ్బు ముట్టచెప్పారు అంతే. అది కాస్తా ఆయన దహనక్రియలకి, దినవారాలకే సరిపోలేదు. తండ్రి గుమాస్తాగా పనిచేసే పేర్ని ఏదయినా సాయం చేయమని అడిగింది. ఆయన ఒక 50 రూ॥ చేతిలోపెట్టి, రవిని చదువు మానిపించి తన కొట్లో లెక్కలు వ్రాయటానికి పెట్టమని సలహా యిచ్చాడు. గిరిజకి ఎందుకనో మనస్కరించలేదు. కొద్దిరోజులు కష్టపడితే తను. వాడు జీవితాంతం సుఖంగా వుండవచ్చుననుకుంది. మధుమూర్తి కూడా, రవిని చదువు మానిపించవద్దు అని సలహా
యిచ్చాడు. గిరిజ జాకెట్లు కుట్టి, వైర్బాగ్లు అమ్మి, టైపుచేసి పెట్టి తృణమో, పణమో సంపాయిస్తూనే వుంది. కానీ అది ఇంట్లోకి అంతంత మాత్రంగానే సరిపోతుంది.

గిరిజ ఆరోజు పక్కింటి సీతారామయ్యగారికి కాగితాలు టైప్చేసి పెట్టి వచ్చింది. గిరిజ వచ్చేసరికి, రవి ఇంట్లో మంచంమీద పడుకుని వున్నాడు. ఈ సమయంలో రవి ఇంట్లో ఉండటం చూచి ఆశ్చర్యపోయింది.

"ఏరా, స్కూలుకి వెళ్ళలేదా?" అంది.

"లేదక్కా!" అన్నాడు.

"ఎందుకని?"

రవి మాట్లాడలేదు. గిరిజకి బాగా కోపం వచ్చేసింది. "ఈ వారంలో నువ్వు స్కూలు మానెయ్యడం ఇది మూడోసారి. ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు స్కూలు ఎగ్గొట్టి, క్లాసులు తప్పి ఇంట్లో కూర్చుంటే, తినడానికి నాన్న మనకి సంపాయించి యిచ్చి వెళ్ళాడనుకున్నావా? నీ చదువు ఎప్పుడు పూర్తి అవుతుందా అని నేను రోజులు లెక్కపెట్టుకుంటున్నాను."

దిండులో తల దూర్చుకుని పడుకున్న రవి, ఎలాంటి సమాధానం చెప్పలేదు. గిరిజ రవి బాగ్ తీసి పట్టుకుని వచ్చింది. "లే, లేచి స్కూలుకి వెళ్ళు. వెళతావా లేదా?" రవి దిండులోంచి తలెత్తి దీనంగా చూశాడు.

"అంతదూరం నేను నడవలేనక్కా!"

"ఎంతదూరం? ఈరోజు మీ స్కూలుకి హఠాత్తుగా దూరం పెరిగిందేమిటి? లే,

0 3."

"అక్కా!" రవి ఏదో చెప్పబోయాడు.

"నువ్వు నాకింకేం చెప్పకు. మాట్లాడకుండా వెళ్ళు. ఇదుగో, ఇప్పుడే చెబుతున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా యిలా స్కూలు మానేశావంటే నేను నీతో మాట్లాడనే మాట్లాడను. అసలు నీ కంటికి కనిపించను తెలిసిందా?"

రవి మాట్లాడకుండా పుస్తకాల బాగ్ తీసుకున్నాడు. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తను అంత గట్టిగా కేకలు వేయకపోతే, రవి మాట వినడని భయం. తండ్రి పోయాడు. రవి చెప్పిన మాట వినకుండా చెడిపోతాడేమో. చదువు పాడుచేసుకుంటాడేమోనని వేదనగా వుండేది.

కిటికీ దగ్గర నిలబడి తమ్ముడు నడిచి వెళ్ళటం చూస్తూనే ఉంది. రవి కొంతదూరం నడిచివెళ్ళి వీధిచివర అక్కడ ఒక రాయి వుంటే, బాగ్ పెట్టుకుని దానిమీద కూర్చున్నాడు. బలవంతంగా ఇంట్లోంచి తను పంపింది. బైట తాత్సారం చేస్తున్నాడు. అసలు వీడికి ఏమైంది? గిరిజకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తలుపువేసి గబగబా బైటికి వచ్చింది. కానీ అప్పటికే రవి, రాయిమీద నుంచి లేచి, మెల్లగా నడిచి వెళ్తున్నాడు. గిరిజ పరీక్షగా చూసింది. వెనుకనుండి చూస్తే రవి నడక నిదానంగా, అయిష్టంగా, వెళ్ళలేక వెళుతున్నట్టుగా వుంది.

ఆసారి మార్కులు రిపోర్ట్ వచ్చినాయి. రవికి అన్నింటిలో తక్కువ మార్కులు వచ్చినాయి. గిరిజ బాగా కేకలు వేసింది. రవి కిమ్మనలేదు. నాలుగురోజుల తర్వాత రవి ఫ్రెండ్ సంతోష్, రవి నాలుగురోజుల నుండి స్కూలుకే రావటంలేదని చెప్పగా విని నిశ్చేష్టురాలు అయింది. ఆ సాయంత్రం రవి ఇంటికి రాగానే, గిరిజ నిలదీసింది. రవి వంచిన తల ఎత్తలేదు. గిరిజకి పిచ్చి ఆవేశం వచ్చేసింది. మూలనున్న గొడుగుతీసి, ఎడాపెడా కొట్టింది. రవి ఏడుస్తూండిపోయాడే తప్ప, జవాబు చెప్పలేదు. మొరాయింపుగా ఎదురు మాట్లాడలేదు.

ఆ సాయంత్రం మధుమూర్తి వస్తే గిరిజ తన మనసులోని బాధ చెప్పేసింది. "వీడిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వీడేమిటి యిలా చేస్తున్నాడు?" అంది. మధు గిరిజని అనునయించాడు.

"నువ్వు కంగారుపడకు. అసలు విషయం ఏమిటో నేను కనుక్కుంటాను." రవి మధుకి చెప్పాడు "నేను నడవలేకపోతున్నాను. నాకు ఊరికే ఆయాసం వస్తోంది. స్కూలులో బోలెడు మెట్లు ఎక్కి దిగాలి. అక్కకి యిది చెప్పినా అర్ధంగాదు."

మధు రవిని పరీక్షగా చూశాడు. రవి చిక్కిపోయి ఉన్నాడు. మెడ దగ్గర ఎముక బాగా కన్పిస్తోంది.

"నీకు ఒంట్లో బాగుండటంలేదా రవీ?" అని అడిగాడు.

"నాకు తెలియదు. ఆయాసం తప్ప నాకింకే బాధాలేదు."

"సాయంత్రం డాక్టరు దగ్గరకి తీసుకువెళతాను పద" అన్నాడు.

మధుమూర్తి ఆ సాయంత్రమే రవిని డాక్టరుగారి దగ్గరకు తీసుకువెళ్ళాడు.

ఆయన ఎక్స్రే లు తీయించమని వ్రాసి ఇచ్చాడు.
"వీళ్ళ దగ్గరికి వెడితే యిదే గొడవ" అంటూ విసుక్కుంది గిరిజ.

రవికి ఎక్స్రేలు తీయించారు.

ఆరోజు - మధుమూర్తి రవిని వెంటబెట్టుకుని అవి తీసుకురావటానికి వెళ్ళాడు.

గిరిజ సీతారామయ్యగారి కాగితాలు టైపు చేస్తోంది. సీతారామయ్యగారు వకీలు చేస్తున్నాడు. గిరిజ తండ్రిమీద అభిమానంతో గిరిజకి టైప్ మిషన్ యిచ్చి, టైప్ చేసిపెట్టే పని అప్పగించారు. ఆయన నెలజీతం యిస్తారు. గిరిజ కాగితాలు యింటిలో టైపు చేసి, తీసుకువెళ్ళి ఆయనకి ఉదయం కోర్టుకి వెళ్ళేలోపల అందిస్తుంది. ఒక్కోసారి చాలా పని ఉంటుంది. రాత్రి పొద్దుపోయేవరకూ టైపుచేస్తూ కూర్చుంటుంది.

ఈరోజు కూడా చాలా వర్క్ వుంది.

గిరిజ టైపు చేయటం ముగించి, కాగితాలు బొత్తిగా పెట్టింది. అల్మైరాలో వున్న గడియారం చూసింది 8 గంటలు అవుతోంది. మధుమూర్తి, రవి యింకా రానేలేదు.

"ఇంతసేపు చేశారేమిటి?" అనుకుంది.

ఇంతలో మధుమూర్తి రానే వచ్చాడు. రవి. అతను రిక్షాలో వచ్చారు. రవి లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఎక్స్రేలు వున్న కవరు వుంది. మధు కూడా లోపలికి వచ్చాడు.

“డాక్టరేమయినా చెప్పాడా?" అని అడిగింది.

"ముందు కాసిని మంచినీళ్ళు యివ్వు" అన్నాడు.

గిరిజ మధుకి మంచినీళ్ళు తెచ్చి అందిస్తూ "రవీ! సీతారామయ్యగార్కి టైపురైటర్ కావాలట, తీసుకువెళ్ళి యిచ్చిరా" అంటూ పురమాయించింది. రవి టైపురైటర్ వైపు వెళ్ళబోతున్నాడు.

"గిరిజా! వద్దు వద్దు. రవికి బరువు పనులు ఏమీ చెప్పకు!" మధుమూర్తి గభాల్న వారించాడు. "రవిని వీలయినంత విశ్రాంతిగా ఉండనీయి" అన్నాడు.

గిరిజ ఆశ్చర్యంగా చూసింది “డాక్టరేమన్నాడు!” అంది.

"చెబుతానుగా, నువ్వు మొదట రవికి అన్నం పెట్టు. తిని పడుకుంటాడు" అన్నాడు. గిరిజ వెళ్ళి రవికి అన్నం పెట్టింది. రవి అన్నం తింటున్నాడు. గిరిజ చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది.

"ఎందుకలా అడుగుతున్నావు?"

"నీ ధైర్యం ఎంత వుందో తెలుసుకోవడానికి భగవంతుడు ఒక చిన్నపరీక్ష పెట్టాడు."

మధుమూర్తి చెప్పాడు! "రవికి హార్టుకి సంబంధించిన వ్యాధి మొదలైంది. అందుకే అతనికి అలా తరచుగా ఆయాసం వస్తోంది. అతన్ని చాలా విశ్రాంతిగా ఉండనీయాలి. ఆపరేషన్ చేస్తే రవికేం ఫర్వాలేదు. చేయించకపోతే మాత్రం ప్రమాదమే! ఎక్కువకాలం బ్రతకడు."

గిరిజ అరవబోయింది.

మధుమూర్తి చప్పున నోరుమూశాడు. "రవి వింటాడు జాగ్రత్త. బెంబేలు పడిపోతాడు. ఇందులో ప్రమాదం ఏమీలేదు. మనం వీలయినంత తొందరలో ఆపరేషన్ జరిగేలా చూస్తే సరి."

"డబ్బు ఎంత అవుతుందిట?"

"సుమారుగా నాలుగువేలు!"

"నాలుగువేలు?" గిరిజ కళ్ళు పత్తికాయలు అయినాయి. నాలుగు వేలు! కోమటి దుకాణంలో నాలుగు వందలు అప్పు తీర్చలేక వాడిచేత నానామాటలు అన్పించుకుంటోంది.

"అయితే అందుకన్నమాట, వాడు స్కూలుకి వెళ్ళలేకపోయింది. పాపిష్టిదాన్ని, వాడి ఒంట్లో సుస్తీగా ఉందని తెలుసుకోలేక పోట్లాడాను, తిట్టాను. చివరకి కొట్టాను కూడా!" గిరిజ అదంతా గుర్తుకువచ్చి ఏడవసాగింది.

"గిరిజా! నీకు ఇదీ విషయం అని తెలియదుకదా? జరిగినదానికి యిప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? డబ్బు సంగతి ఆలోచించాలి. అది ముఖ్యం ముందు."

"అంత డబ్బు ఎవరిస్తారు మధూ?" బేలగా చూసింది.

"నువ్వు సీతారామయ్యగారిని అడుగు. నేను కూడా ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో

ప్రయత్నిస్తాను."

"మధూ! మాకు నువ్వు తప్ప ఎవ్వరూలేరు."

మధు కళ్ళు చెమర్చినాయి. "అమాట నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు తెలియదా?

"గిరిజా, ఇలారా!” దగ్గరికి పిల్చాడు. గిరిజ వచ్చింది. మధుమూర్తి కంఠం తగ్గించి గిరిజా, నా శాయశక్తులా నీకు సాయంచేస్తాను, నువ్వు ధైర్యంగా వుండు." నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. "నువ్వు చాలా ధైర్యం గలదానివి కదూ?"

మధుమూర్తి గిరిజకు బాగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు.
రాత్రి అయింది. గిరిజ మంచంమీద అలాగే కూర్చుంది. కంటిమీదకి కునుకు రావడం లేదు. మాటిమాటికి గిరిజ కళ్ళు నిద్రపోతున్న తమ్ముడి మీదనే నిలుస్తున్నాయి.

“వీడు కూడా లేకపోతే నాకు దిక్కెవరు?” గిరిజకి ఏడుపు వచ్చేసింది. తను ఏం పాపం చేసిందని భగవంతుడు ఇలా చేస్తున్నాడు?

“ఆపరేషన్ చేస్తే నయం అవుతుంది" అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. సుమారు నాలుగువేలు ఖర్చు అవుతుంది. రాయవెల్లూరులోగాని, ఢిల్లీలోగాని చేస్తారు. ఇప్పుడిప్పుడు హైదరాబాదులో కూడా చేస్తున్నారు. మధు ఆ వివరాలు కనుక్కుంటానన్నాడు. నాలుగువేలు! ఎక్కడనుండి తేవడం? ఎక్కడనుంచయినా సరే పుట్టించి తీరాలి. లేకపోతే వాడిని చేతులారా మృత్యువుకి అప్పచెప్పినట్టే అవుతుంది. మంచంమీద రవి శరీరం చైతన్యరహితంగా కన్పించినట్టయింది. గిరిజ వూహామాత్రంగానైనా కంపించిపోయింది. వీల్లేదు, ఎలాగైనాసరే నాలుగువేలు సంపాయించాలి. ఆ మహమ్మారిలాంటి వ్యాధినుంచి రవిని రక్షించాలి. గిరిజలో భయంకరమైన పట్టుదల వచ్చేసింది. "నీ ధైర్యం ఎంత వుందో తెలుసుకోవటానికి భగవంతుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు” అన్న మధు మాటలు గుర్తుకు వచ్చాయి. గిరిజ ఈ పరీక్షలో నెగ్గటానికి దృఢంగా నిశ్చయించుకుంది.

యద్దనపూడి సులోచనారాణి ద్వారా మరిన్ని పుస్తకాలు

ఇతర కుటుంబపరమైన పుస్తకాలు

5
వ్యాసాలు
గిరిజా కళ్యాణం
0.0
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.
1

1వ భాగము

15 December 2023
0
1
0

గిరిజా కళ్యాణంచాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల

2

2వ భాగము

15 December 2023
0
1
0

క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటి

3

3వ భాగము

15 December 2023
0
1
0

గడియారం ఒక గంట కొట్టింది.రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు."ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు."అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు."ఈ

4

4వ భాగము

15 December 2023
0
1
0

సూర్యాస్తమయం అవుతోంది.ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్

5

5వ భాగము

15 December 2023
0
0
0

మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో

---

ఒక పుస్తకం చదవండి