shabd-logo

4వ భాగము

15 December 2023

0 చూడబడింది 0
సూర్యాస్తమయం అవుతోంది.

ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్స్ వున్నాయి. వాటితో దూరంగా, బోటులో వున్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు.

ఒక బోటు బ్రిడ్జి దగ్గరనుంచి వెళుతోంది. "చెందూ! హాయ్!" అందులో ఉన్నవాళ్ళు

చేయి వూపారు. "హాయ్!" కుడిచేత్తో బైనాక్యులర్స్ చూస్తూ, ఎడంచెయ్యి ఎత్తి వూపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి వుంది. ఆ అమ్మాయి జుట్టు దువ్వుకున్న తీరు, గోళ్ళ పాలిష్, భుజానికున్న బాగ్ చూస్తే, ఎంతో శ్రద్ధగా తయారయినట్టుగా వుంది. "రజనీ! నువ్వు వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళలేదు చూడు. వాళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారో" అన్నాడు.

రజని అతన్నే చూస్తోంది. నీరెండలో చెందూ ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటిమీద పడుతోంది. అది చూడటానికి ఎంతో అందంగా వుంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తోంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా వున్నాయి. అతను నిలబడటంలోనే ఒకరకమైన మగసిరి వుంది. మెత్తని టెరీన్పర్ట్, గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తోంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా

వుంటుంది. విషాదచ్ఛాయలుగాని, అశాంతి మబ్బులుగాని, ఆ కళ్ళలో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లయినా అతి ప్రశాంతంగా వున్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండునని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. “ఈరోజు ఉదయం, ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు."

"ఏం కావాలో అడగమని ఇప్పటికి పదిసార్లు చెప్పాను."

"నిజంగానా!"

"నేను ఒట్టిమాటలు ఎప్పుడైనా చెప్పానా?"

రజని నవ్వింది. "అయితే అడగనా?"

"అడుగు."

క్షణం సేపు తటపటాయించినట్టు చూసింది. తర్వాత చెందూ చేతిమీద చేయి వేసింది. "నేను అడిగినదాన్ని తప్పక ఇస్తావుకదూ!"

"స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను."

"చెందూ! నాకు - నాకు - నువ్వే కావాలి!"

"226?"

"రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. "చెందూ! ఐ లవ్ యూ! ఎన్నాళ్ళనుంచో నీకీ మాట చెప్పాలని! ఎప్పుడూ నీ చుట్టూ పదిమంది వుంటారు. సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది."

అతని ముఖంలో బోర్ ఫీలవుతున్న భావం తొంగిచూసింది. కాని అది రెప్పపాటు మాత్రమే. అతను రవంతకూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు.

"నా మనసంతా నువ్వే చందూ! నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి, మా కుటుంబం డబ్బులోగాని, పేరులోగాని ఏమాత్రం తీసిపోదు, మా డాడీ బాగానే సంపాయించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు."

"పెళ్ళా" అతను కంపరంగా చూశాడు.
"అన్యాయం. చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు" నవ్వాడు.

రజని సీరియస్గా చూసింది.

"చెందూ! నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియచేయటానికి అదొక సాకు మాత్రమే."

"థాంక్ యూ! నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో! నేను పెళ్ళికి వ్యతిరేకిని, నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్ళి చేసుకుంటున్నానని శుభలేఖ ఇస్తే వాడి చాపు కబురు విన్నంతగా విచారపడ్తాను."

"పెళ్ళి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా?"

"ఉండిపోతాను."

"ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే?"

"నౌకర్లు ఉంటారు."

"నౌఖర్లు స్వంత మనుష్యులు అవుతారా?"

"ఎందుకవరు? వాళ్ళని మనం స్వంతం చేసుకోవటంలోనూ, భావించటంలోనూ ఉంది. భార్యా, పిల్లలు మాత్రం మనవాళ్ళా? మనం అనుకోకపోతే?"

"నీకు పిల్లా, జెల్లా అవసరం లేదా?"

"ఉహు! నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను."

రజని అతన్నే విచిత్రంగా చూస్తోంది.

"ఎప్పుడూ నీకీ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు?"

"నాన్సెన్స్! ఎప్పుడో ముసలివాడివి అయిపోతానని, ఒంటరితనం వస్తుందని, ఇప్పుడు యీ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే వుంటాను. ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయంలేదు. నాకెవరూ అవసరం లేదు."

రజని ముఖం వెలవెలబోయింది.

"సారీ డియర్! నువ్వు ఇంకేదయినా అడిగివుంటే, నీ కోరిక తప్పక తీర్చేవాడిని." రజని అతని చేయి విదిలించి కొట్టింది. "అలాంటప్పుడు మాతో ఎందుకు చనుపుగా

ఉండాలి?"

"అది నా తప్పు కాదు. నేను స్నేహంకోసం మీవైపు చేయిచాస్తుంటే అది పెళ్ళికోసం అని మీరనుకుంటే నేనేం చెయ్యను? నాకు ఆడా, మగా భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్లా నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటే, నాకీపాటికి నూట పదహారు పెళ్ళిళ్ళు అయివుండేవి.”

రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బాగ్ వూపుకుంటూ, ఎత్తుబూట్లు వేసుకుని, విసవిసా వెళ్ళిపోతున్న రజనిని క్షణం సేపు బైనాక్యులర్స్తో చూశాడు చెందూ. "పాపం ఆడపిల్ల!" అనుకున్నాడు. వీళ్ళతో ఇదే పెద్దచిక్కు కాస్త చనువుగా మెసిలితే, పెళ్ళి పెళ్ళి అంటారు. చెందూ బ్రిడ్జి దాటి నీళ్ళ దగ్గరికి నడుచుకు వచ్చాడు.

ఇంతలో బోటు దగ్గరికి వచ్చింది. అందులోనుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగావున్న చెందూని చూడగానే "హాయ్!" అంది.

"హాయ్!" చెందూ బోటులోకి ఎక్కాడు.

"నేను కూడా రానా?"

“ఇప్పుడేగా వాళ్ళతో తిరిగి వచ్చావు."

"నీతో కలిసి తిరగలేదుగా! వస్తాను."

"ఇంతలో దూరంగా, కార్డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని

వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది.

"రజని వెళ్ళిపోతోందేమిటి?"

"తలనొప్పిగా ఉందిట."

"నిజంగానా?"

రజని వెళ్ళిపోయిందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్ళలో

బయలుదేరింది. చెందూ నీళ్ళమీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు.
"ఎంతో బాగుందికదూ?" కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తలవూపాడు.

"చెందూ!"

"ఊ!"

"నీకెలాంటి భార్య కావాలి?"

"కావ్యనాయికలాంటిదై వుండాలి."

"అ๐?"

"పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబి రేకులలాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతూళ్ళులాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు!" కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం కోమలిది కత్తిరించిన జుట్టు- డైటింగ్ పేరుతో సన్నగా వుంటుంది. కళ్ళు చిన్నవి. అదీగాకుండా ముఖానికి కళ్ళజోడు వుంది.

"అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాలలో కల్పనలోనే దొరుకుతారు."

"ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్ళి చేసుకుంటాను..

"అయితే ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు."

"పోనీ. ఇలాగే వుండిపోతాను. నేను పెళ్ళి చేసుకుంటే, నా తృప్తికోసం, నా ఆనందంకోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్ళిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను."

"నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుడిని ప్రార్థిస్తాను నేను."

"అదేమిటి? ఎందుకని?"

"అంతే మరి. నేను నీకు నచ్చనప్పుడు, నీకు నచ్చినవాళ్ళెవ్వరూ నీకు దొరకకూడదు."

"అదా సంగతి! అసలు మాట చెప్పవేం మరి?" చెందూ బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చక్కిలిగింతలు పెట్టినట్లుగా నీళ్ళు కూడా అలలుగా కదలుతున్నాయి.

"పెళ్ళి! పెళ్ళి! మీ ఆడపిల్లలకి ఎంతసేపూ పెళ్ళిమాట తప్ప ఇంకో ధ్యాసే వుండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, యిదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా, స్వేచ్ఛగా బ్రతకటం చేతకాదా? పంజరంలో పక్షుల్లా మాటిమాటికీ ఆ బందిఖానాయే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమయిగా వుండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచాలత్వం లేకుండా వుండాలి" అన్నాడు చెందూ.

కోమలి అతన్నే చూస్తోంది. "ఇతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు" అనుకుంది.

చెందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. "ఇలాంటి డబ్బుగలవాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు ఎందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లో గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవడం విచిత్రమే.

చెందూ చూడటానికి నవ్వుతూ, తుళ్ళుతూ, సరదాగా వుంటాడు కానీ, అంతరాంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా, ఏ అమ్మాయీ అతన్ని పెళ్ళిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమేకాదు. అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్లా పొందే అపజయమే" అనుకుంది కోమలి.

యద్దనపూడి సులోచనారాణి ద్వారా మరిన్ని పుస్తకాలు

ఇతర కుటుంబపరమైన పుస్తకాలు

5
వ్యాసాలు
గిరిజా కళ్యాణం
0.0
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.
1

1వ భాగము

15 December 2023
0
1
0

గిరిజా కళ్యాణంచాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల

2

2వ భాగము

15 December 2023
0
1
0

క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటి

3

3వ భాగము

15 December 2023
0
1
0

గడియారం ఒక గంట కొట్టింది.రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు."ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు."అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు."ఈ

4

4వ భాగము

15 December 2023
0
1
0

సూర్యాస్తమయం అవుతోంది.ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్

5

5వ భాగము

15 December 2023
0
0
0

మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో

---

ఒక పుస్తకం చదవండి