shabd-logo

2వ భాగము

15 December 2023

1 చూడబడింది 1
క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ వుంటారని తెలియచేస్తున్నాయి.

సోఫాలో రాజగోపాలరావు కూర్చుని వున్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి వున్నాయి. వయసు మళ్ళి చర్మంలో ముడతలు కన్పిస్తున్నా, కళ్ళలో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసినా జుట్టు వత్తుగా చక్కటి క్రాఫ్ వుంది. ఆయన్ని చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కన్పిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా, తెరిచి వుంచిన పేపరు వుంది. ప్రక్కనే శాయన్న వినయంగా నిలబడి వున్నాడు. ఎదురుగా మేనేజరు చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తున్నాడు.

ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు.

"నిన్నగాక మొన్ననే గదయ్యా నాలుగువేలు తీసుకున్నాడు అన్నావు, మళ్ళీ యిప్పుడు వేయి రూపాయలా! డబ్బు చెట్లకు కాస్తోందనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్ధంకాదు.. శాయన్నా! వాడితో నేను నయాపైసా కూడా ఇవ్వసన్నానని చెప్పు వెళ్లు."

"అలాగేనండీ" శాయన్న వెళ్ళబోయాడు.

"ఆగు! వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడు యింట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది?" శాయన్న గుర్తుచేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. "నెలమీద రెండున్నర రోజులండీ!"

“నెలమీద రెండున్నరరోజులు, వాడికి ఇంటిమీద ఏ మాత్రమైనా ధ్యాస వుందా? ఎంతసేపూ ఆ ఫ్రెండ్స్ని మేపటానికి యిక నా దగ్గిర డబ్బులు లేవని చెప్పు, వాడిని నేను మార్చలేను. నా తరంకాదు. వాడిపట్ల నా మనసు విరిగిపోయిందయ్యా,"

ఇంతలో చెందూ మెట్లు దిగి వస్తున్న శబ్దం అయింది. ఫ్రెండ్స్తో కలిసి మౌల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు.

చెందూ కంఠం వినగానే ఆయన ఒడిలో వున్న పేపరు తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. శాయన్న భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాలమీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజరు అక్కడనుండి వెళ్ళిపోవాలా, వద్దా అన్నట్లు సంశయిస్తున్నవాడిలా చూస్తున్నాడు.

చెంద సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. "గుడ్ మార్నింగ్ తాతయ్యా" అన్నాడు.

"ఊ" ఆయన సీరియస్ గా అన్నాడు.
చెండూ ఆయన చేతిలోవున్న పేపరు లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు.

"అరెరె ఏమిట్రా ఇది?" ఆయన చెందూ భుజాలు పట్టుకున్నారు. “దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభిరస్తు!" లేవదీస్తూ అన్నారు.

"మొదటిది కావాలి తాతయ్యా రెండోది వద్దు."

"ఏం, ఎందుకని?"

"అవి పొందాలంటే పెళ్ళి చేసుకోవాలి."

రాజగోపాలరావు మనుమడిని ఒక్క నిముషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికలేనని అందరూ అంటూంటే, ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెధవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్ట అయిందిగానీ, చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది అని! జవసత్వాలతో కళకళలాడుతున్న చెందూని చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోయేముందు తన చెయ్యి అందుకొని "నాన్నా వాడికి ఇకనుంచీ నువ్వే తల్లీ, తండ్రీ కూడా. ఎలా పెంచుతావో!" అనడం గుర్తుకు వచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధపెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చినమాట నిలబెట్టుకోవడం ఏమి వుంటుంది?

"ఏమిటి తాతయ్యా అలా చూస్తున్నావు? ఈరోజున నేను కొత్తగా కన్పిస్తున్నానా?" చిరునవ్వుతో అడిగాడు చెండూ.

"లేదురా. ఎంత పెద్దవాడివి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్ళి చేయాల్సిందే! తప్పదు."

"తాతయ్యా!" చెందూ గోముగా చూశాడు. "ఈరోజు నా పుట్టినరోజు. నాతో పోట్లాడతావా?"

"ఉహుహు. నేనెందుకు పోట్లాడతాను. ఉన్న విషయం చెప్పాను అంతే."

"ఈ విషయం మన మధ్య ఎప్పుడూ వుంటుందిగా తీరుబడిగా మాట్లాడుకుందాం."

చెందూ మేనేజరు వైపు తిరిగాడు. "సభావతిగారూ! శాయన్న మీకు చెప్పలేదా? నాకు వేయి రూపాయలు కావాలి."

సభావతి రాజగోపాలరావుగారివైపు చూడసాగాడు. చెందూ క్షణం సేవు తాతగారివైపు, సభాపతివైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు

గారు మేనేజర్వైపు కోపంగా చూస్తూ "ఏమిటయ్యా అలా చూస్తావు. వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా." అన్నారు.

సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖంవైపు చూస్తున్నాడు.

"నీకేనయ్యా చెప్పేది. ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తావు? వెళ్ళు, వెళ్ళి తీసుకువచ్చి

సభాపతి వెళ్ళిపోయాడు.

"తాతయ్యా! మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజి బుక్ చేసుకున్నాం. పార్టీ చేసుకుంటున్నాం."

"అలాగే మంచిది. వయసులో వున్నప్పుడే సరదాలు. వయసు వుడిగిన తర్వాత ఏం చేయగలం. ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి."

మేనేజరు డబ్బు తెచ్చి చెందుకు ఇచ్చాడు.

"వస్తాను తాతయ్యా! ఇక నీకు కనిపించటం రేపు పొద్దుటే."

"రాత్రికయినా భోజనానికి రావా?"

"చూస్తాను తాతయ్యా, ఈ దెయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను" ఫ్రెండ్స్న చూపిస్తూ అన్నాడు.

“సరే సరే నీ ఇష్టం" అన్నారాయన.

చెందూ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిపోయాడు.

మనుమడితోపాటే రాజగోపాలరావుగారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది.

"ఈ దెయ్యాలు నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో వదలవు" అన్నాడు.

"మీరు గట్టిగా వుండమంటే చినబాబు వుండేవారు" అన్నాడు శాయన్న. రాజగోపాలరావుగారు శాయన్నవైపు తిరిగారు. "చాల్లే. నీకేం తెలుసు వాడి సంగతి. నేను వుండమంటే తప్పకుండా వుంటాడు. కాని పుట్టినరోజునాడు వాడిని నేను ఎలా బాధపెట్టను?" ఆయన దృష్టి మేనేజరు మీద పడింది. చివాట్లు వేస్తున్నట్లుగా అన్నారు. "ఏమయ్యా, నీకసలు కాస్తయినా బుద్దుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురాపటమేనా?" మేనేజరు తెల్లబోయాడు. "మీరే కదండీ తెమ్మన్నారు" అంటూ నసిగాడు.

"తెమ్మన్నాను నిజమే. కానీ, నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా! ఛి ఛీ మీలో ఒక్కరికి కూడా బుర్రలేదు" అంటూ విసుక్కున్నారు.
ఇంతలో ఫోన్ మోగింది. మేనేజరు వెళ్ళి తీశాడు. "లాయరుగారు చేశారు" అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. "హలో! ఏమిటోయ్ శేషారత్నం? ఆ చేసేటందుకు ఏముంది? వాకింగ్ అయింది. కాఫీ తాగడం పూర్తి అయింది. చెందూనా? వాడెక్కడున్నాడు? ఆ దెయ్యాలు వచ్చి తీసుకుపోయినాయి. నేను వున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా. నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా! భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనేం? మనిద్దరం వున్నాంగా! ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే. సరిగ్గా 12 గంటలకి రా. ఎదురుచూస్తుంటాను. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని. నీకు తెలుసుగా. ఈమధ్య వూరికేనే కోపం వస్తోంది. అలాగే, అలాగే" అని పెట్టేశారు. మేనేజరుతో "మధ్యాహ్నం లాయరుగారు భోజనానికి వస్తున్నారు. ఏదైనా స్పెషల్ చేయించండి" అని పురమాయించారు.

తర్వాత ఫోన్ మోగుతూనే వుంది. రాజగోపాలరావుగారు మనుమడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే వున్నారు.

ఒక గంటసేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారగిలబడి కూర్చుంటూ -“ఇదిగో సభాపతీ! ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లోలేనని చెప్పు"

అన్నారు.

శాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చి యిచ్చాడు. ఆయన తాగారు, ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణం సేపు తదేకంగా ఆ ఫోటోవైపే చూడసాగారు. కమల స్వభావం చెందకి రానే లేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా వుండేది. తనకి వున్నది ఒకే ఒక్క కూతురైనా పదిమంది పిల్లల పెట్టుగా సందడిగా వుండేది. కమలా కమలా అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా, ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపారరీత్యా తను ఎప్పుడూ బిజీగా వుండేవాడు. వ్యాపారం ఎకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా వుండేది. ఎవరు ఎంత చిన్న తప్పుచేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే, తనకి ఎన్నోసార్లు "కమల మగపిల్లవాడయితే ఎంత బాగుండేది" అనిపించేది.

కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనుమడిని తను ఆనందంగా చూస్తుంటే "నాన్నా! ఇక దిగులుపడకు. వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేనిలోటు ఫీలవకుండా భర్తీ చేస్తాను...." అంది నవ్వుతూ,

తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగల పరుగెత్తే సెలయేరులావుండే కమల, భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే, తనకోసం ఆ దుఃఖం లోలోపల దిగమింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకి కళ్ళనీళ్ళు వచ్చేవి.

చెందూ పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం యిచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోతపెట్టింది. చెందూ 10 సంవత్సరాల పిల్లవాడుగా వుండగా కమలకి కేన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లూ కమలని రక్షించలేకపోయారు. ఎంతమందికో తను ఎన్ని రకాలుగానో సాయంచేసి, వాళ్ళ జీవితాలు కుదుటపడేట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు..... తన కన్నకూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది.

కమలని తను మృత్యువునుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. "ఎందుకు నాన్నా బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావుకూడా రాసిపెట్టి వుంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగముగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరేగా. నాన్నా! చిన్నప్పుడే అమ్మ పోవడంతో, నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళి అయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు..... ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది అంతేగా?"

"కమలా!" తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు..

"నాన్నా!" కమల చేయి తన చేతిమీద ఆనించింది.

"నువ్విలా బెంబేలుపడితే ఎలా? చెందూని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి

ఉన్నావనే ధైర్యంతోనే, నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు

దిగులుపడితే, చెందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలనా ఎలా జరుగుతుంది?"

బేలగా అంది.

"అమ్మా, కమలా!"

"వాడి ముద్దు ముచ్చటా నేను ఏదీ చూడలేకపోయాను. నాన్నా...... వాడికి నేను

లేనిచోటు తెలియకుండా పెంచుతావు కదూ!"

"ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా! ఇక నేను బ్రతికేది దేనికోసంట?"
"ఇకనుంచి వాడికి అమ్మా నాన్నా నువ్వే అవాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్నా! నాకు మాట ఇవ్వు" కమల ఏడ్చేసింది.

తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకూ అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అన్పిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను, చెందూని ఎక్కువగా నౌకర్లమీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలుపడతాడోనని, ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చెందూ జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువ అయింది.

ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటినుంచీ చెండూ స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూంలో లైటుకి బంతివేసి కొట్టి పాడుచేశాడని, పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దని అంటే, ఆ రోజంతా చెందూ అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి "చెందూతో ఆడుకోటానికి రా" అనేవరకూ ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు.

ఆ విధంగా చెందూ జీవితంలో స్నేహితులు చివరికి తనకీ, వాడికీ మధ్య అడ్డుగోడగా తయారవసాగారు.

రాజగోపాలరావుగారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చెందూ పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్ళి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలివుంది. అదికూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా ఫర్వాలేదు.

ఆయన చెందకి తగిన ఆడపిల్లకోసం కంచుకాగడా వేసినట్టుగా వెతుకుతూనే వున్నారు. చెందూకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే- స్వభావంలో కమలని పోలి వుండాలి.

చెందూకి ఎందుకోగాని పెళ్ళి ఇష్టంలేదు. బ్రహ్మచారిగానే వుండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళూనడానికి ఆ స్నేహితులే కారణం అని ఆయన అనుమానం. చెందూకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై వుండాలి! అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం వున్న పిల్ల అయితే బాగుంటుంది.
కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం!

యద్దనపూడి సులోచనారాణి ద్వారా మరిన్ని పుస్తకాలు

ఇతర కుటుంబపరమైన పుస్తకాలు

5
వ్యాసాలు
గిరిజా కళ్యాణం
0.0
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.
1

1వ భాగము

15 December 2023
0
1
0

గిరిజా కళ్యాణంచాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల

2

2వ భాగము

15 December 2023
0
1
0

క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటి

3

3వ భాగము

15 December 2023
0
1
0

గడియారం ఒక గంట కొట్టింది.రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు."ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు."అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు."ఈ

4

4వ భాగము

15 December 2023
0
1
0

సూర్యాస్తమయం అవుతోంది.ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్

5

5వ భాగము

15 December 2023
0
0
0

మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో

---

ఒక పుస్తకం చదవండి