shabd-logo

1వ భాగము

15 December 2023

5 చూడబడింది 5
గిరిజా కళ్యాణం

చాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢనిద్రలో వున్నాడు ఒక అతను. తొలి ఉషస్సులో కాంతి, పిల్ల తెమ్మెరలని జంటగా తోడ్కొని తెరచి వుంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొలపటానికి ప్రయత్నిస్తోంది! ఇంతలో మంచం పక్కన వున్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తల దూర్చుకుని, నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని వున్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి, కళ్ళు తెరవకుండానే - నిద్ర బద్ధకంతో 'హలో' అన్నాడు.

అవతలనుంచి అతిసుతారంగా వున్న కంఠం "హలో చెందూ! గుడ్మార్నింగ్! విష్ యూ ఏ వెరీ హాపీ బర్త్డే డార్లింగ్!" అంది.

“వెరీ గుడ్మార్నింగ్: థ్యాంక్ యూ!" బద్ధకంగానే అన్నాడతను. లేచావా?" ఉహు!

“నేనే లేపానా?”

"ఊ!"

“అయితే నిద్రలేపి, బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పినదాన్ని నేనే నన్నమాట! నువ్వు నాకు తప్పకుండా ఏదయినా బహుమతి యివ్వాలి” ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం.
"అయామ్ వెరీ వెరీ హాపీ! నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా?” అతను మాట్లాడలేదు. విని వూరుకున్నాడు. “మాట్లాడవేం? నిన్నే!”

"నిద్ర ముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోర్గా వుంది. బై!" అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తల దూర్చుకొని మళ్ళీ నిద్రలో మునగబోయాడు.

ఫోన్ మళ్ళీ మోగింది.

అతను తీశాడు.

“హలో చెందూ! విష్ యూ ఎ వెరీ వెరీ హాపీ బర్త్డే!”

"థ్యాంక్ యూ!"

"పార్టీ ఎక్కడ? మనవాళ్ళు ఎవరెవరు వస్తున్నారు?" ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది.

"మళ్ళీ చెయ్యి! ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను” అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగిచూసింది. అతను రిసీవరు తీసి పక్కన పెట్టేశాడు.

అతని నిద్ర ఎగిరిపోయింది! వెల్లకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తయిన ప్రశాంతత వుంటుంది.

కిటికీలో నుంచి మందారచెట్టుమీద పిచ్చికలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా వుంది. తలక్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో యిష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు.

ఇంతలో తలుపుమీద టక్ టక్ మని వినిపించింది.

"కమిన్!" అన్నాడు. లోపలకి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపరు వుంది. అది తెచ్చి అందిస్తూ “చిన్నబాబూ! ఈరోజు తమరి పుట్టినరోజు" అన్నాడు. అతను పేపరు అందుకుంటూ తల వూపాడు.

“ఆ మాట ఇప్పటికి కనీసం పదిమంది అయినా గుర్తు చేశారు శాయన్నా” అన్నాడు.
"

"ఎక్కువమంది స్నేహితులు వుంటే అంతే బాబూ! మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా!".

అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. "ఇదిగో శాయన్నా!"

శాయన్న వెంటనే ఆగాడు. భక్తిశ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు.

“ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బైట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయటచేస్తాను! తాతయ్యకి చెప్పు."

"తాతగారు మీ పుట్టినరోజని, లాయరుగారిని భోజనానికి పిలుస్తున్నారండీ!"

"అబ్బా నువ్వు చెబుదూ!”

“అలాగే!” శాయన్న వెళ్ళిపోయాడు.

చెందూ పేపరు మంచంమీద పడేసి కిటికీ దగ్గరకు వచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు, ఆప్టర్లు విరగబూసి వున్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ, సూర్యకిరణాలు వెచ్చని కౌగిలికోసం వేచి చూస్తున్నాయి. ఎత్తయిన కాంపౌండువాలు వెంట పెంచిన రంగు రంగుల బోగన్ విల్లాలు కనులకింపుగా వున్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవటానికి కట్టిన గ్లాసుహౌసు కప్పుమీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగెలు వేళ్ళాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా వుంది. ఆ ఇంట్లో లోపలా బయటా అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కన్పిస్తోంది.

అతను చిన్నప్పటినుంచీ గమనిస్తూనే వున్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూతోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా వుండటంగాని, వాటి మధ్య గడ్డి పెరగటంగాని అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో వుంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆకుల అంచులమీద పడి, అక్కడనుంచి జారి కిందనున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్షు అత్యల్పం! కాని వాటి అందం అనిర్వచనీయం! మనిషి జీవితం కూడా అలాగే వుండాలి.

అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్మాద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి
ఈరోజుతో 28 సం||లు నిండుతున్నాయి. అబ్బా! 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రం అయినా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళి అయితే భార్య, పిల్లలు పరమ బోర్! అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తన తోటివాడే సూరి! పెళ్ళి కాకముందు పందెం గుర్రంలా ఎలా వుండేవాడు.

పెళ్ళి అయింతర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమయిపోయిందో, శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్యా, పిల్లలు అదే గొడవ! ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళి అయిన 5 సంవత్సరాల్లో ఇంకేం పనిలేనట్టు ముగ్గురు పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవచ్చవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు నరకం!

అతను పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. మంచంమీద కూర్చుని పేపరు తిరగేయసాగాడు. మొదటిపేజీలో తాటికాయంత అక్షరాలతో, పొరుగుదేశంలో మిలట్రీ ప్రభుత్వం గద్దెక్కటానికి జరిపిన విధ్వంసకాండ వుంది. అతను దానిమీద ఆసక్తిలేనట్టు పేజీ తిప్పేశాడు. పేపరు చివరి పేజీనుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి, తర్వాత గుర్రపు పందేలు గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు.

సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయమారుతంలా, మంచిగంధం పరిమళంలా, గలగలపారే సెలయేరులా వుంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం పది కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు, అతను భుక్తికోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్కమాటలో చెప్పాలంటే అతను రావుబహద్దూర్ రాజగోపాలరావుగారి ఏకైక మనుమడు అనేకంటే, అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పవచ్చు.

పేపరు యధాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపరులో ఒక మూల బాక్స్కట్టి "అనాధ యువతి అభ్యర్ధన" అని హెడ్డింగు వుంది. అతను ఆ ప్రక్కన చదివాడు. అందులో ఇలా వుంది.

"దయాధర్మం గల ప్రతి వ్యక్తికీ నా నమస్కారం! నా పేరు గిరిజ! నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు వున్నాడు. వాడు హృద్రోగంతో, వైద్యసహాయంలేక,
రోజురోజుకీ మృత్యుసన్నిధికి చేరువ అవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు! ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి రెండువేల రూపాయలు కూడబెట్టుకున్నాను! ఇంకొక్క రెండువేల రూపాయలు వుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను! మీరు రోజూ మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ వుంటారు! మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే, ఒక జీవితాన్ని మృత్యు ముఖంలోంచి తప్పించినవారు అవుతారు! మరో జీవితానికి అండ గల్పించిన ధర్మాత్ములు అవుతారు! మీరు పంపబోయే యే కాస్త డబ్బు అయినా, నేను లక్షలు, కోట్లు అన్నంత విలువగా భావిస్తాను! ఎందుకంటే, కొన్ని వానచినుకులే కుండెడు నీళ్ళుగా మారతాయి! నా యీ ప్రకటనను చూసిన ప్రతివ్యక్తీ, మమ్మల్ని కనికరించి, నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను! మీరు మాకు ఒక రూపాయి పంపితే, మీకు పది రూపాయలు కలిసివచ్చేటట్లు చేయమని నేను భగవంతుడిని ప్రార్థిస్తాను! నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను-”

చెందూ రెండు మూడుసార్లు ఆ ప్రకటన చదివాడు! అతి ప్రశాంతంగా వున్న ఆ ఉదయపువేళ అతని మనసు అనాధ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది! అతను ఏదయినా భరించగలడు గానీ రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు.

అతను లేచివెళ్ళి బీరువా తెరిచాడు! అందులో వున్న డబ్బు తీశాడు. శాయన్న కాఫీ తెచ్చాడు

"కాఫీ బాబూ!"

“అక్కడ పెట్టు” చెందూ డ్రాయరు సొరుగులాగి అందులోనుంచి సీజర్స్తోసి, ఆ

పేపర్లో ప్రకటన వున్న అంత మేరా కట్ చేశాడు.

కాఫీ కప్పు తెచ్చి అందిచ్చిన శాయన్నకి డబ్బు అందించాడు.

"ఏమిటి బాబూ ఇది?"

“శాయన్నా! ఈరోజు నా పుట్టినరోజు కదూ!"

"అవును."

"నా పుట్టినరోజునాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పనిచేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా?”

"అవును."
“ఈరోజు యీ మంచిపని చేస్తున్నాను చూడు" అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. శాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగొంది.

“నేను ప్రతిసారీ మీరు స్నేహితుల గొడవలోపడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ వుంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు.”

చెందు కాఫీ తాగుతూ అన్నాడు - "ప్రతిసారీ ఏం మంచి పని చేయాలా అని నేను తలబద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే యీ బెడద పోయింది.”

"క్రితంసారి మీరు పెళ్ళి జరిపించిన పనిమనిషి శీతాలు కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండీ!”

"ఏమిటి? ఏడాది తిరక్కుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా?" చెందూ కంగారుగా చూశాడు. “అయితే నేను మంచిపని చేయలేదు అన్నమాటే!”

చెందూ తన లెటర్ పాడ్ తీసి, దానిలో తన అడ్రస్, పేరూ వున్నంతమేరా మడిచి చింపేశాడు. తెల్లకాగితం మీద గబగబా నాలుగు వాక్యాలు ఇలా వ్రాశాడు - "గిరిజగార్కి! మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా వుండేందుకు, మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవాలని, మీరు ఆనందంగా వుండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్."

అది మడిచి శాయన్న చేతికిస్తూ - "రెండువేల రూపాయలకు డి.డి. తీసుకుని ఈ ఉత్తరం జతచేసి పంపు. చూడు, అడ్రస్ కేరాఫ్ పోస్ట్మాస్టర్ అని ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలుపెడితే చచ్చిపోతాను! అదొక పరమబోర్” అన్నాడు.

శాయన్న తల వూపాడు.

"చిన్న బాబూ! క్రితంసారి శీతాలు కూతురు పెళ్ళి చేసిన ఖర్చుకోసం సిగరెట్లు సంవత్సరమంతా మానేశారు! ఈసారి దీని భర్తీకోసం ఏం మానేస్తారు?"

"సినిమాలు!"

"సినిమాలే!”

"అవును"

"ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబూ!"
"నేను నియమం అంటే వాళ్లు మాట్లాడరుగా?" శాయన్న అవును అన్నట్లు చూశాడు. శాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చెందూ పిలిచాడు. "నా దగ్గర ఇక డబ్బులేదు. తాతయ్యని అడిగి ఒక వేయి రూపాయలు పట్టుకురా! ఫ్రెండ్తో పార్టీ వుందని చెప్పు.”

"♡!”

"తాతయ్య ఏం చేస్తున్నాడు?"

"ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చారు. కాఫీ తాగుతున్నారు.”

“అయితే మంచి మూడ్లో వుండి వుంటారు. ఇప్పుడే చెప్పేసెయ్యి" అన్నాడు.

“అట్లాగే!” శాయన్న వెళ్ళిపోయాడు.

రెండు నిముషాల తర్వాత చెందూ యీలపాట పాడుతూ, స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు! ఫోన్ మోగుతూనే వుంది! కానీ అతను రవంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్బాత్ తీసుకోసాగాడు. అవతలినుంచి ఫోన్ ఆగి ఆగి, మళ్ళీ మళ్ళీ మోగుతూనే వుంది! అతని వరస చూస్తే అందరికీ అతను కావాలిగానీ, అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా వుంది. స్నానంచేసి ఇవతలికి పచ్చాడు.

శాయన్న గదిలో కొత్తబట్టలు తయారుగా పెట్టాడు. చెందూ వాటిని తీస్తుంటే, అందులోనుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను యీలపాటు పాడుతూనే, ఆ కాగితం తీసి చూశాడు. అందులో "పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య!" అని వుంది. చెందూ ముఖంమీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా వూదాడు. అది దూరంగా వెళ్ళి పడింది. చెందూ కొత్తబట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజునాడు మాత్రమే సందడి వుంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతీక్షణమూ వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవటం పూర్తికాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు.

కారు తాళాలు తీసుకుని యీలపాట పాడుకుంటూ, తీరికగా, విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగుపెట్టగానే అతని నోటిమీద వున్న యీలపాట టక్కున ఆగిపోయింది.

అక్కడ కుర్చీలో వరసగా డజనుమంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని వున్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులు వున్నాయి.

"విష్ యూ ఎ వెరీ హాపీ బర్త్ డే చెందూ!" అందరూ లేచి ఒకేసారి కలగాపులగంగా అన్నారు.
రమేష్ పెద్ద గులాబీదండ తెచ్చి మెడలో వేశాడు. "వెరీ వెరీ హాపీ బర్త్" అన్నాడు.

చెందూ తమాషాగా తలవంచి అభివాదం చేశాడు.

“థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.”

"విష్ యూ ఆల్ ది గుడ్లక్” అన్నాడొకతను.

"ఇంకేం లక్తే బాబూ! ఈ ప్రపంచంలో వున్న లక్ అంతా వాడిదేనయ్యె" అన్నాడు ఇంకో అతను.

"అసలు లక్ భార్యామణి వస్తేగాని బైటపడదోయ్! పాపం! మన సూరిని చూడరాదూ!” అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు.

“అందుకే మనం ఎవరికీ లొంగకూడదని అనుకుంటే, అసలు పెళ్ళి చేసుకోకూడదు” అన్నాడు చెందూ. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెల పోయినాయి. చెందూ అది

గమనించగానే అన్నాడు - "పెళ్ళికంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ.”

"ఇంతకీ పార్టీ ఎక్కడ?”

"చెందూ రమేష్ వంక చూశాడు.

"హిమాయత్ సాగర్ దగ్గర. స్వీట్ డ్రీమ్ కాటేజీలో లంచ్. ఆ తర్వాత బోటుషికారు” రమేష్ చెప్పాడు.

“రోజు అప్పటికి అయిపోదే మరి? రాత్రి చాలా మిగిలి వుంటుంది.”

అప్పుడు మళ్ళీ పార్టీ. కాని అది మగవాళ్ళకు మాత్రమే పరిమితం” అర్ధయుక్తంగా చూశాడు రమేష్, అందరూ ఘోల్లున నవ్వారు.

మెడలో పెద్ద గులాబీ దండతో, చేతిలో పూలగుత్తి పట్టుకొని వెంట మిత్రబృందం పరివేష్టితమౌగా రాజకుమారుడిలా మెట్లు దిగి వచ్చాడు చెందూ.

యద్దనపూడి సులోచనారాణి ద్వారా మరిన్ని పుస్తకాలు

ఇతర కుటుంబపరమైన పుస్తకాలు

5
వ్యాసాలు
గిరిజా కళ్యాణం
0.0
నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.
1

1వ భాగము

15 December 2023
0
1
0

గిరిజా కళ్యాణంచాలా విశాలంగా, అధునాతనంగా వున్న గది అది! ఆ గదిలో ఆ మంచంమీద వున్న మల్లెపువ్వులాంటి తెల్లటి పక్క మినహా, మిగతా సామాను అంతా పింక్ కలర్లో వుంది. ఆ పక్కమీద సిల్కు చారల పైజామా, షర్టుతో సొమ్మసిల

2

2వ భాగము

15 December 2023
0
1
0

క్రింద విశాలమైన హాలు వుంది! దానిలో మధ్యగా ఖరీదయిన సోఫాసెట్ వుంది. అక్కడ నేలమీద పరిచివున్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా వుంది. గోడవారగా, వరసగా వేసి వున్న కుర్చీలు ఆ యింటి

3

3వ భాగము

15 December 2023
0
1
0

గడియారం ఒక గంట కొట్టింది.రాజగోపాలరావుగారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు.ఆయన మాటి మాటికీ వీధి గుమ్మంవైపు చూస్తున్నారు."ఇదుగో శాయన్నా! శాయన్నా!" అంటూ పిలిచారు."అయ్యా!" అంటూ శాయన్న పరుగెత్తుకు వచ్చాడు."ఈ

4

4వ భాగము

15 December 2023
0
1
0

సూర్యాస్తమయం అవుతోంది.ఆరుబైట గాలి చల్లగా, హాయిగా వుంది. హిమాయత్నాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చెందూతో వచ్చిన ఫ్రెండ్స్ వున్నారు. చెందూ బ్రిడ్జిదగ్గర నిలబడి వున్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్

5

5వ భాగము

15 December 2023
0
0
0

మధ్యాహ్నం ఎండ ఎంతో తీక్షణంగా వుంది. విజయవాడలో గ్రీష్మ ఋతువు అప్పుడే తన అధికారం నెలకొలుపుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుగా వుంది. నాలుగు కుటుంబాలు కాపురముంటున్న ఆవరణ అది. ఒక వాటాలో ఏది మాట్లాడినా, రెండో

---

ఒక పుస్తకం చదవండి