shabd-logo

కన్యాశుల్కం-ప్రథమాంకము

8 November 2023

14 చూడబడింది 14

1వ స్థలము : విజయనగరములోని బొంకులదిబ్బ (గిరీశము ప్రవేశించును)

గిరీ:- సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెలరోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పూటకూళ్ళమ్మకి, నాకూ యుద్ధమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది గాని, పూర్రిచర్డు చెప్పినట్లు పేషెన్స్ వుంటేనేగాని లోకంలో నెగ్గలేం.

ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు వూరుకుంది కాదు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగర్లు మాట ఆచోకి కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవరైనా చెప్పివుంటాడు.

ఉదయం కథ ఆలోచిస్తే ఇ టు పైని తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటుచూసినా అందరికి బాకీలే. వెంకుపంతులుగారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు, సమయం కని పెట్టి దేహశుద్ధి చేస్తారు.

Can love be controlled by advice?

Will cupid our mothers obey?

శీఘ్రంగా ఇక్కణ్ణించి బిచాణా ఎత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం, కాని మధురవాణిని వదలడఁవంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

It is women that seduce all mankind

నేను ఏదో ఉద్యోగాలూ, ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో వుంది, పూర్ క్రీచర్.

ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశంలా వున్నాడు. ఇవ్వాళ  'కిస్మిస్' శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరిని చూస్తే పరీక్ష ఫెయిలయినట్టు కనబడుతుంది. వీణ్ణి కొంచెం ఓదార్చి, వీడికి శలవుల్లో చదువు చెప్పే మిష మీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి.

అట్నుంచి నరుక్కు రమ్మన్నారు!

(వెంకటేశం ప్రవేశించును)

ఏమివాయ్, మైడియర్ షేక్స్పియర్! మొహం వేలాడేశావ్?

వెంక - ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నారు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు.

గిరీ :- నాన్సెన్స్, మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాష్టారుకి నన్నుచూస్తే కిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు. గాని లేకుంటే నువ్వేవిఁటి, ఫెయిల్ కావడవేవిఁటి, అతనికి, నాకూ, యెందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పేపర్లో యేకేశాను. అప్పట్నుంచి నేనంటే వాడిక్కడుపుడుకు.

వెంక :- మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చటం ఒక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁకాని ఒక్కమారయినా 'ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు?

గిరీ - డామిడ్! ఇలాంటి మాటలంటే నాకు కోపం వొస్తుంది, ఇది బేస్ ఇన్స్టాటిట్యూడ్, నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాట కొస్తే నీకున్న లాంగ్వేజి నీ మాష్టరుకుందీ!  విడో మారేజ్ విషయమై నాచ్చి కొశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను! నా దగ్గర చదువు కున్నవాడు ఎవడూ అప్రయోజకుడు కాలేడు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ఇలెవెన్ కాన్ డిజనరేషన్ ఆఫ్ ఇండియాను, గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చర్ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. మొన్న బెంగాళీ వాడు ఈ వూళ్ళో లెక రిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలింది! మనవాళ్ళు వొట్టి వెధవాయి లోయ్! చుట్ట నేర్పినందుకు థాంక్స్ చెప్పక తప్పుపట్టుతున్నావ్? చుట్ట కాల్చడంయొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చ ర్యంగా వుంది.

చుట్ట కాల్చడం బట్టే కదా దొరలు అంతా గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని ఇంగ్లీషువాణ్ని చూశావూ? చుట్ట పంపిణిమీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కని పెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా!!

శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే, సూత ఉవాచ —

క॥ ఖగపతి యమృతము తేగా

భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ !

పొగ చెట్టయి జన్మించెను

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్|

ఇది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది. అది అలా ఉంది గానీ, నీ అంత తెలివైన కుర్రవాణ్ని ఫెయిల్ చేసినందుకు నీ మాష్టరు మీద నాకు వొళ్ళు మహా మండుతూంది.

ఈ మాటు వంటరిగా చూసి వొక తడాఖా తీస్తాను. నువ్వు శలవుల్లో ఇక్కడుంటావా, పూరికి వెళతావా?

వెంక:- వెళ్ళాలని ఉంది. కాని పాస్ కాలేదంటే మా తండ్రి చావ కొడతాడు?

గిరీ :- ఆ గండం తప్పే ఉపాయం నేన్చెబుతాను. నే చెప్పి నట్టల్లా వింటానని ప్రమాణంఁ చేస్తావూ?

వెంక :- (గిరీశం కాళ్ళు పట్టుకొని) మీ శలవు ఎప్పుడు తప్పను? మా తండ్రికి మా చెడ్డకోపం. పాసు కాలేదంటే యెవిఁకలు విరగ్గొడతాడు. (కన్నీరు చేత తుడుచుకొనును)

గిరీ :- దటీజ్ టిరనీ, ఇదే బంగాళీ కుర్రవాడయితే ఏం జేస్తాడో తెలిసిందా? తాతయేది, తండ్రి యేది కర్ర పట్టుకుని చమా లెక్కగొడ తాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరి యవళ్ళయినా యీ వూళ్ళో చదువుకుంటున్నారా?

వెంక :- మరెవళ్ళూ లేరు.

గిరీ:- ఐతే నేనో ఉపాయం చెబుతాను విను. నేను కూడా నీతో మీ వూరొచ్చి పరీక్ష పాసయినావని మీ వాళ్ళతో చెబుతాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి ఒచ్చానని మీ వాళ్ళతో చెప్పు; శలవు లాఖర్ని నిన్ను టవున స్కూల్లో పైక్లాసులో ప్రవేశ పెడతాను.

వెంక:- మీరేవొస్తే బతికాను. మరేఁవిటి? కిందటిమాటు శలవులికే మా అమ్మ మిమ్మల్ని తీసుకు రమ్మంది?

గిరీ :- ఆల్రైట్ గాని నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టం వస్తుందే! మునసబుగారి పిల్లలికి శలవుల్లో పాఠాల్చెబితే ఫిఫ్టీ రుపీస్ యిస్తా వఁన్నారు. అయినా నీ విషయమై యంత లాస్ వచ్చినా నేను కేర్ చెయ్యను. ఒక భయం మాత్రం వుంది. మీ వాళ్ళు బార్ బరస్ పీపుల్ గదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో, చెయ్యరో నీవు నా గురించి మీ మదర్ గట్టిగా రికమెండ్ చెయ్యవలసి వుంటుంది. కొత్త పుస్తకాలికి నొక జాబితా రాయి. కొంచెం డబ్బు చేతిలో వుంటేగాని, సిగర్సుకి ఇబ్బంది కలుగుతుంది. నోటుబుక్కు తీసి రాయి. 1. రోయల్ రీడర్, 2. మాన్యూల్ గ్రామర్, 3. గోష్ జియామెట్రీ, 4. బాస్ ఆల్జీబ్రా, 5. శ్రీనివాసయ్యర్ అర్థమెటిక్, 6. నలచరిత్ర, 7. రాజశేఖర చరిత్ర, 8. షెవర్డు జనరల్ ఇంగ్లీషు, 9. వెంకట సుబ్బారావు మేడీజీ, యెన్ని పుస్తకాలయినాయి?

వెంక :- తొమ్మిది.

గిరీ :- మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్టు. అక్కడికి చాల్ను. మీ వాళ్ళుగాని ఇంగ్లీషు మాట్లాడమన్నట్టాయనా తణుకు, బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువు కున్న ముక్కలు, జ్ఞాపకం వున్నంతవరకు, యాకరు పెట్టు. నీ దగ్గర కాపర్సు ఏవైనా వున్నవా? నా దగ్గర కరెన్సీనోట్లు వున్న విగాని మార్చ లేదు. పదణాలు పెట్టి ఓ శేరు మిఠాయి పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చెయ్యను. మార్కట్టుకు వెళ్ళి బండి కుదిర్చి దాని మీద ట్రావెలింగ్ ట్రంకువేసి మెట్టుదగ్గిర బండి నిలబెట్టి వుండు. యిక్కడ కొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకొని యంత రాత్రికైనా వొచ్చి కల్పు కుంటాను. గో ఎట్వన్సు. మైగుడ్బాయ్! నువ్ బుద్ధిగా వుండి చెప్పిన మాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాధ్ బానర్జీ అంత గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు జాగ్రత్త.

(వెంకటేశం నిష్క్రమించును.)

గిరి:- యీ వ్యవహార మొహటి పైసలయింది. ఈ రాత్రి మధుర వాణికి పార్టింగ్ విజిట్ యివ్వందీ పోకూడదు. (రాగవరసతో పాడును)

నీ సైటు నా డిలైటు

కాన్న కున్న

క్వైటు రెచడ్ ఫ్లయిటు.

మూను లేని నైటు.

(ఒక బంట్రోతు ప్రవేశించును)

బంట్రో :- నేను పొటిగ రామప్పపంతులుగారి నౌకర్నండి, లెక్క జరూరు గుందండి, పొటిగరాపులు కరీదు యెంటనే యిప్పించమన్నారండి.

గిరీ:- (విననట్టు నటించుతూ) జాసిమిన్ను పైటటా మూను కన్న నీదు మోము బైటటా టా! టా! టా!

బంట్రో - యంతమందిని పంపినా యిచ్చారు కారటండి. నేవాళ్ళలా గూరుకుండేవోణ్ని కానండి.

గిరీ :- అయ్య కోనేటికి తోవ యిదే.

బంట్రోః- యక్కడి తెవిఁటి మాలోకం వొచ్చిందయ్యా!

గిరీ:- కోవఁటి దుకాణవాఁ? కస్పా బజారులో గాని, ఇటువేపులేదు.

బంట్రో:- (గట్టిగా చెవి దగ్గర నోరు పెట్టి) పొటిగరాపుల కరీ దిస్తారా, యివ్వరా?

గిరీ:- బస, రాదారీ బంగళాలో చెయ్యొచ్చును.

బంట్రో:- (మరీ గట్టిగా) యాడాది కిందట మీరూ, సాశీ కలసి తీసుకున్న పొటిగరాపులు కరీదు కొమ్మన్నారు. మా పంతులు నిలబెట్టి పుచ్చు

గిరీ:- ఒహో నీవటోయ్ ! యెవరో అనుకున్నాను. నింపాదిగా మాటాడు; నింపాదిగా మాటాడు. రేపు ఉదయంయెనిమిది ఘంటలక పూటకూళ్ళమ్మ యింటికివస్తే అణాపయినల్తో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులుకి స్నేహం, మంచీ, చెడ్డా అక్కర్లేదూ?

బంట్రో:- మాటలతో కార్యంలేదు. మొల్లో సెయ్యెట్టి నిల్చున్న పాట్ని పుచ్చుకొమ్మన్నారండి.

గిరీ:- పెద్దమనిషివిగదా, నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద మనిషి! యీ చుట్ట చూడు, ఎంత మజాగా కాలు తుందో, హవానా అంటారు దొర్లు దీన్ని, రేప్పొద్దున్న రా, రెండు కట్ట లిస్తాను.

బంట్రో:- శిత్తం, సొమ్ము మాటేం కలవండి?

గిరీ:- చెప్పాను కానా? రేప్పొద్దున యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు.

బంట్రో:- మాలాడి కొడుకు శండాలుడు కాకుంటే మరేటండి?

గిరీ:- నీకు నమ్మకం చాలకపోతే యిదిగో, గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను.

బంట్రో :- శిత్తం రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబో రుండదండి.

గిరీ:- ఆహాఁ? నీ ఆబోరు ఒహటి, నా ఆబోరు ఒహటినా!

(బంట్రోతు నిష్క్రమించును)

గిరీ:- ఇన్నాళ్ళకి జంఝుప్పోస వినియోగంలోకి వచ్చింది. థియా సఫిస్టులు చెప్పినట్లు మన ఓల్డు కష్టమ్సు అన్నిటికి యేదో ఒహ ప్రయో జనం ఆలోచించే మనవాళ్ళు యార్పరిచారు.

ఆత్మానుభవం అయితేగాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని ఒదుల్చుకునే సరికి తలప్రాణం తోక్కొచ్చింది. శీఘ్రబుద్ధేః పలాయనం, పెందరాశే వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. ఇక మధురవాణి యింటికి వెళదాం. మేక్ హే వైలీసన్ షైన్స్ అన్నాడు.

2వ స్థలము : : మధురవాణి యింట్లో గది (రామప్పంతులు కుర్చీమీద కూర్చుండును. మధురవాణి యెదట కూర్చుండును)

రామ: - (జేబులోంచి చుట్టతీసి పంట కొన కొరికి) పిల్లా! అగ్గిపుల్ల.

మధు:- (అగ్గిపుల్ల వెలిగించి చుట్ట కందించుచుండగా రామప్పం తులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గి పుల్ల రాల్చి యడంగా నిలబడి కోపం కనపర్చుతూ) మొగవాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి. తాకవద్దంటే చెవిని పెట్టరు గదా?

రామః- నిన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా వూరు లేవతీసుకు వెళ్ళడానికి సిద్ధవఁయ్యుంటే యింకా యవడో కోన్కి స్కా హేగాడి ఆడాలో వున్నా నంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి?

మధుః- వేశ్య అనగానే అంత చులకనా పంతులుగారూ? సాని దానికి మాత్రం నీతి వుండొద్దా? మా పంతులుగార్ని పిలిచి "అయ్యా, యిటు పైని మీతోవ మీది, నాతోవ నాది" అని తెగతెంపులు చేసుకున్న దాకా నేను పరాధీనురాలినే అని యెంచండి. మీరు దెప్పిపొడిచినట్టు ఆయన వైదీకయిక తేనేమి, కిరస్తానం మనషైతేమి, పూటకూళ్ళమ్మను వుంచుకుంటే నేమి, నన్ను యిన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడుకాడా? మీరంతకన్నా రసికులయినా, నా మనస్సు మీరు యంత చూరగొన్నా, ఆయన యదల విశ్వాసం నాకు మట్టుకు వుండొద్దా?

రామ:- పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కు వాడు పూటకూళ్ళమ్మని వుంచుకోవడం కూడానా! పూటకూళ్ళమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి బోస్తూంది.

మధుః - ఆన్యాయం మాటలు ఆడకండి. ఆయన యంత చదువు కున్నాడు, ఆయనకి యంత ప్రఖ్యాతి వుంది. నేడో, రేపో గొప్ప ఉద్యోగం కానై య్యుంది.

రామః - అహహ! (నవ్వుతూ) యేం వెర్రి నమ్మకం! నీవు సాని వాళ్ళలో తప్పపుట్టావు. గిరీశంగారు, గిరీశంగారు అని పెద్ద పేరు పెడతా వేవిఁటి? మా వూళ్ళో వున్న లుద్దావధాన్లు పింతల్లి కొడుక్కాడూ వీడూ! గిరడని మేం పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా వక్కటే వుద్యోగం దేవుడు రాశాడు. యేవిఁటో తెలిసిందా?పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవచాకిరీ చెయ్యడం.

మధు:- యీ మాటలు ఆయన్ని అడుగుదునా?

రామ.- తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు.

మధు:- అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేమి పని? యేవఁ యినా అయిన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనబడవ్.

రామ:- అయితే అతడికి విడాకులు యెప్పుడిస్తావు?

మధుః- యిక్కడి రుణాలు, పణాలూ తీర్చుకోవడానికి మీరు శల విచ్చిన రెండువొందలూ యిప్పిస్తే ఈ క్షణం తెగతెంపులు చేసుకుంటాను. రామ :- అయితే యింద (జేబులో నుంచి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి అందుకొంటుండగా రామప్పపంతులు చెయ్యిపట్టి లాగును. మధురవాణి కోపంతో చెయ్యి విడిపించుకొని నోట్లు పారవేసి దూరముగా నిలుచుండును.)

మధు:- మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం, ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని యేవఁన్నమ్మను?

రామ:- (నోట్లు యెత్తి) క్షమించు అపరాథం, (నోట్లు చేతి కిచ్చును) లెక్క పెట్టి చూచుకో.

మధు: ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండీ నా మనసు కనిపెట్టజాలినారు కారుగదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని  కాను. (నోట్లు యివ్వబోవును).

రామః - వొద్దు!వొద్దు!వొద్దు! నీ మనసు కనుక్కుందావఁని అన మాటగాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంట వెధవ, వీడెవడో మా గొప్పవాడనుకుంటున్నా వేఁమిటి?

మధుః- ఆయన్ని నా యదట తుల్నాడితే, యిదుగో, తలుపు తీశాను, విజయం చెయ్యండి (తలుపు తీసి వకచేత పట్టుకొని రెండవచేతి వేలుతో పైకి తోవచూపును అదుగో, గిరీశంగారే వొస్తున్నారు. ఆ మాటేదో ఆయన్తోదే చెప్పండి.

రామ:- వేళాకోళం ఆడుతున్నావూ?

గిరీ:- (వాకిట్లోంచి) మైడియర్!

రామ: -(ఆత్మగతం)అన్న! వేళగాని వేళొచ్చాడు గాడిదకొడుకు. తంతాడు కాబోలు, యేవిఁటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం, (మంచంకింద దూరును)

(గిరీశం ప్రవేశించును)

గిరీశం:- వెల్, మైడియర్ ఎంప్రెస్! (భుజము మీద తట్టబోవును)

మధు:- (ఒసిలి తప్పించుకుని) ముట్టబోకండి.

గిరీ:- (నిర్ఘాంతపోయి) అదేవిటి ఆ వికారం?

మధు: ఆఖరు వికారం

గిరీ:- (ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది. చెప్మా! సానివాళ్ళకి కర్ణపిశాచి వుంటుంది కాబోలు! (పైకి) మైలబడితే స్నానంచేసి వేగిరం రా.

మధుః- ఇప్పుడేం తొందర? తలంచుకుంటాను.

రామ:- (ఆత్మగతం) చబాష్. యేమి నీతయిన మనిషి వెధవని ముట్టుకోనివ్వకుండా యెత్తు యెత్తింది. యిది?

గిరీ:- మైలా, గియిలా మా ఇంగ్లీషువారికి లక్ష్యంలేదు. ఇలారా. (దగ్గరికి చేరును).

మధు:- (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును, నేను కిరస్తానం యింకా కాలేదే! మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒహరు చెప్పగా విన్నాను.

రామ:- (తనలో)నే చెప్పానంటుందా యేమిటి!

గిరీ:- ఒకరు చెప్పగా విన్నావు? ఎవరా జెప్పింది? ఎవడికిక్కడికి రావడానికి మగుదూర్ వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె వుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీ కెక్క గుండుంది? చెప్పు?

రామ: - (తనలో) తంతాడు కాబోలు! యరక్క చిక్కడ్డాను. మధు:- మొగాడే చెప్పాలా యేవిఁటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా?

గిరీ:- (తనలో) పూటకూళ్ళముండే చెప్పింది కాబోలు! (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది?

మధు:-పరువైన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకు రాకూడదు? ముందు కూచోండి. తరువాత కోప్పడుదురుగాని, చుట్ట తీసు కోండి అదిగో అగ్గిపెట్టె.

గిరీ:- ముట్టుకోవడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వ డానికయినా పెట్టిపుట్టాను కానా? ఈవాళ మహా ఉత్సాహంగా వచ్చాను. గాని ఉత్సాహ భంగం చేశావ్.

మధు: - ఏవిఁటా వుత్సాహం?

గిరీ:- ఇదిగో జేబులో, హైదరాబాద్ నైజామువారి దగ్గరినించి వొచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదరదాలత్ బావురల్లీఖాన్ ఇప్ప హన్ జంగ్ బహద్దర్ వారు సిఫార్సుచేసి వెయ్యి సిక్కా రూపాయల జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా

బావారి హుజుర వుండడం.

రామ:- (తనలో) యేవిఁట్రా వీడి గోతాలు!

గిరీ:- ఇంత శుభవార్త తెచ్చినా, దగ్గరికి రానిచ్చావు కావుకదా? నాతో హైద్రాబాద్ వస్తావా?

మధు:- (తల తిప్పుతూ)నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసి కెళ్ళండి.

గిరీ:- (నిర్ఘాంతపోయి) పూటకూళ్ళమ్మ ఏవయినా పెంట పెడు తూందా యేఁవిటి?

మధు :- మీకే తెలియాలి.

గిరీ: నీ తెలివితక్కువ చూస్తే నాకు నవ్వొస్తుంది. యవడేమన్నా నామీద, నమ్మడఁవేనా? ఈ ఘోరవైఁన అబద్ధాలు నీతో యవడు చెబు తున్నాడో కనుక్కోలేననుకున్నావా యేవిఁటి? సస్తసముద్రాల్దాటినా వాడి పిలకట్టుకొని పిస్తోల్తో వొళ్ళు తూట్లు పడేటట్టు ఢా ఢా మని కొట్టకపోతి నట్టయినా నా పేరు గిరీశ మే, నినాదభీషణ శంఖము దేవద త్తమే!కబడ్డార్!

మధు: - సముద్రాలవతల కెళ్ళి వెతకక్కరలేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు.

రామ - (తనలో) ఈ ముండ నన్ను కాబోలా దైవమా! బయట బెడుతుంది

గిరీ:- (తనలో) థాంక్గాడ్, అయితే పూటకూళ్ళదానెబ్బ తగల్లేదు.(పైకి) ఇలాంటి దుర్మార్గపు కూతలు ఆ యిల్లాలి సెవిని పడితే చాలా భేదిస్తుంది. ఆ పాపవంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత యంత యోగ్యురాలు!

మధు:- వెధవముండకి పాతివ్రత్యం అన్న మాట ఈ నాటికి విన్నాను.

గిరీ:- దానికి ----కాదు, ఆమెకి మొగుళ్ళేకపోయినా ఆమెను వెధ వనడానికి వీల్లేదు.

మధు: మీరుండగా వెదవెలా అవుతుంది?

గిరీ:- నాన్సెన్స్ (దీనికో ఠస్సా చెప్పి రంజింప చేద్దాం) ఇదిగో విను. దాని నిజమేమిటంటే, పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునిష్టి ముసలాడికి కట్టె నిశ్చయించినారు. పుస్తె కట్టబోతూంటేనో,కట్టిన ఉ త్తరక్షణంలోనో ఆ ముసలాడు పెళ్ళిపీటలమీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి అయినట్టా, కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తె కట్టాడన్నారు. కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి, పెళ్ళికొడుకు వారసులమీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గిర లంచం పుచ్చుకుని పుస్తె కట్టలేదని సాక్షివిఁచ్చాడు. దాంతో కేసు పోయింది. మరి దాన్నెవరూ పెళ్ళాడారు కాదు.

మధు:- అయితే మరి మీకు తప్పలేదే?

గిరీ:- యేవిఁటి ఈ కొత్త మాటలూ! నాకు ఆదీ అంతూ తెలియ కుండా వుందీ! ఆహాఁ.... సరసం విరసంలోకి దిగుతూందే! హాస్యానికంటే నివ్వేనా ఆనందవేఁ నిజవఁనిగాని అంటివా, చూడు నా తడాఖా. యవడి మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా ?

మధు: రామ....

రామ:- (తనలో) సచ్చానా, పేరు చెప్పేసింది!

మధు: - రామ రామ! ఒహరు చెప్పేదేవిఁటి, లోకమంతా కోడయి కూస్తూంటేను? (వీధిలోంచి “తలుపు తలుపు” అని ధ్వని)

గిరీ:- (తెల్లబోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు. ఆ పిలిచే మనిషి వెర్రిముండ. మనుష్యుల్ని కరుస్తుంది.

మధు:- తలుపు తీసేవుంది.

గిరి :- గువెళ్ళి గడియ వేసేయ్.

మధు:- అదుగో, తలుపు తోసుకు వొస్తూంది.

గిరి :- గెంటేయ్, గెంటెయ్!

మధుః- ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (వాకిట్లోకి వెళ్ళును.)

గిరీ:- మంచంకింద దూరుదాం. (మంచం కింద దూరి, తనలో) దొంగ లంజ! సరసుణ్ణి దాచిందోయ్ మంచంకింద! యిదేవిఁటో మంచి మనిషి అని భ్రమించాను. దీ నస్సాగొయ్యా! సిగపాయదీసి తందునుగాని ఇది సమయం కాదు. అయినా, పోయేవాడికి నాకెందుకు రొస్టు? (రామప్పంతు లతో మెల్లగా) యవరన్నా మీరు, మహానుభావులు ?

రామః- నేను రామప్పంతుల్ని రా అబ్బాయీ!

గిరీ:- తమరా? ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా మహాను భావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే!

రామ:- (తనలో) బతికానా దేవుఁడా (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు? అలా తెలిస్తే నే రాకపోదును సుమా!

గిరీ:- మాట వినపళ్ళేదు. కొంచెం యిసుంటా రండి. (రామప్పంతులు ముందుకు జరుగును. గిరీశం అతన్ని తప్పించుకొని గోడవేపు చేరును)

గిరీ:- అన్నా ! ఈ లంజను యన్నడూ నమ్మకండి. ఇలా ఇరవై మందిని దాచగల శక్తుంది దీనికి.

రామ:- రెండువందలు దొబ్బిందిరా బాబూ!

గిరీ:- నువ్వులేం జాగ్రత్త చేశారా?

రామ:- అంతేనా?

గిరీ:- మరేవిఁటి?

(మధురవాణిన్ని, పూటకూళ్ళమ్మ పల్లెవాటులో చీపురుకట్ట దాచిన్ని ప్రవేశింతురు)

మధు:- మీరన్న మనిషి యిక్కడ లేరంటే చెవిని బెట్టరు గదా! పూట:- నీ యింట్లో జొరపడ్డారని వీధుల్లో వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానా యేవిఁటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి? వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చేయ్.

మధు:- యవడికిచ్చావో వాణ్ణి అడగవమ్మా!

పూట:- వెధవ కనబడితే సిగపాయిదీసి చీపురుకట్టతో మొత్తు దున యెక్కడ దాచావేమిఁటి?

మధు :- నాకు దాచటం ఖర్మవేఁవి? నేను మొగనాల్ని కాను. వెధవ ముండనీ కాను. నా యింటికొచ్చేవాడు మహారాజులాగ పబ్లిగ్గా వొస్తాడు. (కంటితో మంచం కింద చూపును)

వూట:- మంచం కింద దాగాడేమో! (మంచము కిందకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది, లేచిర. చీపురుకట్ట తిరగేసి రామ ప్పంతులను కొట్టును)

రామః - ఓర్నాయినా, నన్నెందుక్కొడతావే దండుముండా? (మంచం కిందనించి పైకి వచ్చి, వీపు తడుముకొనును)

మధుః- ఆయన్నెందుక్కోట్టావు? నా యింటికొచ్చి ఏవిటీఁ రవ్వ? పూట అయితే మంచం కిందెందుకు దూరాడు?

మధు:- నీకెందు కా గోష? అదో సరసం.

పూట:- ఇదో చీపురుకట్ట సరసం.

రామ:- (వీపు తడు వుఁకుంటూ) నీ సిగతరగా, ఆడదానివై పోయి నావే! లేకుంటే చంపేని పోదును. నీ రంకుమొగుణ్ని కొట్టక నన్నెందు క్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకు తోసి తాను గోడవేపు దాగున్నాడు?

పూట:- ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద! కుక్కా, పైకి రా.

గిరీ:- వెరస్సా! మంచం కిందికి రా, వెర్రి వొదల గొడతాను.

పూట :- అప్పనిట్రా వెధవా, నీకు? నీకు భయపడతా నను కున్నావా యేవిఁటి? నీ సానిముండ యలా అడ్డుకుంటుందో చూస్తాను. (ఒకవేపు నుంచి మంచం కిందికి దూరును. మరివొక వేపునుంచి గిరీశం పైకి వచ్చి రామప్పంతులు నెత్తి చరిచి, లఘువేసి పెరటివేపు పరుగెత్తి పోవును)

రామ :- సచ్చాన్రా నాయనా! (రెండు చేతుల తల పట్టుకొని) మధురవాణీ! యేవీఁబేహద్బీ? కనిప్టీబుక్క బురంపించూ.

మధుః- యెందుకు పబ్లికున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందురుగాని, [రామప్పంతుల్ని కౌగలించుకుని తల ముద్దెట్టుకుని చేతరాసి యేవి దుష్టు మొగవాడయినవాడు యెదుట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడ తాడూ! వాడి పొంకం అణుతురుగాని లెండి....

రామ:- గవురనుమెంటు జీతవిఁచ్చుంచిన కనిష్టిబులుండగా మన కెందుకు శరీరాయాసం? ఈ వెధవని పజ్యండు కోట్లంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను. చూడు నా తమాషా!

మధు:- (రామప్పంతుల్ని ముద్దెట్టుకుని) మాటాడక వూరుకొండి. (మంచం కిందవేపు చూపించి నోరుమూసి) దొంగదెబ్బ కొట్టిన వారిదే అవమానం; మీదికాదు.

రామః - నొ ప్పెవడిదనుకున్నావు. ఆ ముండ మంచం కిందనుంచి రాదేం? చీపురుకట్ట లాక్కో.

పూట:- ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (పైకి వచ్చును)

(అంతా నిష్కమింతురు)

1
వ్యాసాలు
కన్యాశుల్కం
0.0
ఈ పుస్తకం గురజాడ అప్పారావు గారి రచనలలో ప్రముఖ రచన. ఈ పుస్తకం మీకు వినోదాన్ని ఆడించటం తో పాటు చాలా విషయాలను తెలియచేస్తుంది. సగటు స్త్రీ యొక్క సామాజిక పరిస్థితి గురించి మీకు సవివరం గా వివరిస్తుంది. మనుషుల విది విధానాల గురించి మీకు క్షుణ్ణం గా వివరిస్తుంది. చాలా విషయాలు మనుషుల గురించి ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు తెలుసుకుంటారు.

ఒక పుస్తకం చదవండి